హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మెట్రో ప్రయాణ వేళలను పొడగిస్తున్నట్టు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలు మొదలైన నాటి నుంచి పట్టణంలో నివసిస్తున్న వారు ట్రాఫిక్ అంతరాయం నుంచి భారీ ఉపశమనం పొందారు. గతంలో హైదరాబాద్ లో ఎక్కడికీ వెళ్లాలన్నా బస్సుల్లోనో, సొంత వాహనాల్లోనో వెళ్తూ ట్రాఫిక్ అంతరాయంతో సమయానికి చేరుకోలేక తీవ్రమైన ఇబ్బందులు పడేవారు.
మెట్రో వచ్చిన నాటి నుంచి ఆ ఇబ్బందులకు చెక్ పెట్టినట్టు అయింది. ప్రస్తుతం మెట్రో ప్రయాణ సేవలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఈ సేవలను మరింత సమయం పెంచాలని పలువురి నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న మెట్రో ఎం.డీ. ఎన్వీఎస్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో ప్రయాణ సేవలను రాత్రి 11.45 గంటల వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 01 నుంచి మెట్రో లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.