తెలంగాణలోని యాదగిరిగుట్ట దేవస్థానంలో కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్ధం సత్యనారాయణ స్వామివ్రతాల బ్యాచ్ ల సంఖ్యను పెంచుతున్నట్లుగా ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. ప్రస్తుతం 4 బ్యాచ్ లుగా నిర్వహిస్తున్న సత్యనారాయణ స్వామి వ్రతాలను కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు నిత్యం 6 బ్యాచ్ లుగా నిర్వహించనున్నట్లుగా తెలిపారు. కొండ కింద వ్రత మంటపంలోని హల్స్ 1, 2లలో రొటేషన్ పద్దతిన వ్రతాలను నిర్వహిస్తారని పేర్కొన్నారు.
మొదటి బ్యాచ్ ఉదయం 7గంటల నుంచి 8గంటల వరకు, రెండో బ్యాచ్ 9నుంచి 10గంటల వరకు, మూడో బ్యాచ్ 11గంటల నుంచి 12గంటల వరకు, నాల్గవ బ్యాచ్ మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు, ఐదో బ్యాచ్ 3గంటల నుంచి 4గంటల వరకు, ఆరవ బ్యాచ్ సాయంత్రం 5నుంచి 6 గంటల వరకు’ నిర్వహిస్తామని తెలిపారు. కార్తీక శుద్ధ పూర్ణిమ పర్వదినం నవంబర్ 15వ తేదీన ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు 8 బ్యాచ్ లు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న 3 బ్యాచ్ లకు అదనంగా మరో రెండు బ్యాచ్ లు పెంచి కార్తీక మాసంలో నిత్యం 5 బ్యాచ్ లలో వ్రతాలు నిర్వహిస్తామని తెలిపారు