ఏపీ సీఎం జగన్‌తో నాకు పరిచయమే లేదు: చీకోటి ప్రవీణ్‌

-

క్యాసినో వ్యవహారంలో ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ రోజు ఈడీ అధికారులు క్యాసినో ఏజెంట్లైన ప్రవీణ్, మాధవరెడ్డిలను ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లోని అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన వివరాలు అడుగుతున్నారు. కొన్ని ఖాతాలకు సంబంధించిన వివరాలను.. ప్రవీణ్ ఈడీ అధికారులకు చెప్పలేకపోతున్నాడు. నేపాల్‌లో జరిగిన క్యాసినోకు డబ్బులు ఎలా తీసుకెళ్లారని అడిగిన ప్రశ్నకు ప్రవీణ్, మాధవ రెడ్డిలు పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది.

హైదరాబాద్‌లో నగదు తీసుకొని కాయిన్స్ ఇచ్చి… నేపాల్‌లో ఆ కాయిన్స్ ఇస్తే.. నగదు ఇచ్చినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. క్యాసినోలో గెల్చుకున్న డబ్బును తిరిగి ఇస్తే అక్కడ కాయిన్స్ ఇచ్చారని.. ఆ కాయిన్స్‌ను తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే ప్రవీణ్, మాధవ రెడ్డిలు నగదు ఇచ్చినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేల్చిన ఈడీ అధికారులు.. 25కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో తనకు పరిచయమే లేదని క్యాసినో కేసు నిందితుడు చీకోటి ప్రవీణ్ స్పష్టం చేశాడు.. కొందరు తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి తప్పుడు పోస్టులు చేస్తున్నారని అన్నాడు. ఈ విషయంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అనంతరం మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యాడు.

‘నా పేరుపై కొందరు నకిలీ ట్విట్టర్ ఖాతాలు తెరిచారు. నకిలీ ఖాతాలతో కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. ఏపీ సీఎం జగన్‌తో నాకు పరిచయమే లేదు. అసాంఘిక శక్తులు దీని వెనుక పనిచేస్తున్నాయి. ఏపీ ప్రతిపక్ష నాయకులు చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఏపీ ప్రతిపక్షం అంటే ఎవరో ప్రపంచమంతా తెలుసు. రాజకీయాలకు నాకు ముడిపెడుతున్నారు.’ చీకోటి ప్రవీణ్, క్యాసినో కేసు నిందితుడు

Read more RELATED
Recommended to you

Latest news