ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుందని సీఎం కేసీఆర్ అన్నారు. మోదీ ఇప్పటికే రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు ప్రైవేటుపరం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు సంస్కరణల పేరిట విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ ఒత్తిడి చేస్తున్నారని.. చచ్చినా… రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనని కేంద్రానికి చెప్పానని కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాల్కొండలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.
‘ధరణి పోర్టల్ వల్ల రైతులకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ధరణి వచ్చాక రైతుల భూములపై ఉన్న బాసులు లేకుండా పోయారు. ధరణి వల్ల భూముల రిజిస్ట్రేషన్లలో దళారులు లేకుండా పోయారు. ఎవరూ అడగకుండానే రైతుబంధు తీసుకువచ్చాను. తెలంగాణలో ఇవాళ 3 కోట్ల టన్నుల వరి పండుతోంది. మిగతా ప్రాజెక్టులు పూర్తయితే 4 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తాం. కరెంట్, సాగునీరు సమస్య పరిష్కరించుకున్నాం. యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తయితే.. తెలంగాణలో ఎప్పటికీ విద్యుత్ సమస్య రాదు. 17 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు.. ఎక్కడైనా పింఛను ఇస్తున్నారా? నెహ్రూ సరిగ్గా ఆలోచించి ఉంటే.. ఎస్సీల జీవితాలు ఎప్పుడో మారిపోయేవి. రైతుబంధు ఇచ్చి ప్రజల సొమ్ము దుబారా చేస్తున్నానని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు ఉండాలో.. వద్దో ప్రజలు ఆలోచించాలి.’ అని కేసీఆర్ ప్రజలకు సూచించారు.