ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం షురూ అయింది. ఇక వరుస పర్యటనలతో.. సభలు.. ప్రసంగాలతో దూసుకెళ్లేందుకు పక్కా ప్రణాళిక రచించారు గులాబీ బాస్. హుస్నాబాద్ వేదికగా ఎన్నికలకు శంఖారావం పూరించిన కేసీఆర్.. రోజుకు రెండు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల్లోకి తొమ్మిదన్నరేళ్ల అభివృద్ధిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గులాబీ దళపతి రోజుకు రెండేసి సభలతో …నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు.
ఈ క్రమంలో ఇవాళ జనగామ, భువనగిరి సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను వివరించడంతోపాటు పదేళ్లలో చేసిన అభివృద్ధి.. .బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే పథకాలను, కార్యక్రమాలను….ముఖ్యమంత్రి ఆ సభల్లో వివరించనున్నారు. ప్రతిపక్షాలు లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించనున్నారు.
తొలుత కేసీఆర్….జనగామ వికాస్‌నగర్‌లోని వైద్యకళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వ హించే తొలి సభను గులాబీ సేనలు ప్రతిష్టాత్మక్మంగా తీసుకొని జనసమీకరణ చేస్తున్నారు. అనంతరం భువనగిరి జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. భారీగా జనం తరలివచ్చేలా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి విస్తృత ఏర్పాట్లు చేశారు.