అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా బీజేపీ ప్రచారంలోకి దిగింది. ఓవైపు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ నేతలను రంగంలోకి దించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇక ఇవాళ్టి నుంచి వరుసగా జాతీయ నేతలు రాష్ట్రానికి రానున్నారు. తమ ప్రసంగాలతో.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తూ.. కేంద్రం తెలంగాణకు చేసిన పనులను వివరిస్తూ ఓటర్లను ఆకర్షించనున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్రంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటించనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్నికల సభల్లో రాజ్‌నాథ్ పాల్గొననున్నారు. జమ్మికుంట, మహేశ్వరంలో నిర్వహించే సభల్లో పాల్గొననున్న రాజ్‌నాథ్.. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 12.10 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి రాజ్‌నాథ్ సింగ్ చేరుకుంటారు. అక్కడ ఆయనకు రాష్ట్ర నేతలు ఘనస్వాగతం పలకనున్నారు.
అనంతరం శంషాబాద్ నుంచి హెలికాప్టర్‌లో రాజ్‌నాథ్ సింగ్ హుజూరాబాద్‌కు వెళ్లనున్నారు. హుజూరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో జమ్మికుంటకు చేరుకుంటారు. అక్కడ సభలో ప్రసంగించిన అనంతరం మహేశ్వరానికి బయల్దేరతారు. మహేశ్వరం మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించే సభలో పాల్గొని.. రాత్రి 7.35 గంటలకు తిరిగి దిల్లీకి పయనమవుతారు.