తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి వానలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భీభత్సం సృష్టిస్తున్నాయి వర్షాలు. అయితే..ఈ భారీ వర్షాల నేపథ్యంలోనే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి… సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరద పరిస్థితిపై ఈ సందర్భంగా ఆరా తీశారు.
ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్ట్ లు, చెరువులు, కుంటల్లో పరిస్థితిపై సీయం కేసీఆర్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్.
అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరో 24 గంటల పాటు అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. హెలీపాడ్ లను సిద్ధంగా ఉంచాలన్నారని ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.