తెలంగాణ ఆడపడుచులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని.. మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుందని అన్నారు. భారతీయ సంస్కృతి, జీవనతాత్వికతకు ఇది వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. తోడబుట్టిన అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీపౌర్ణమి సందర్భంగా.. ప్రజలందరికీ కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. రాఖీ పండుగను ప్రజలంతా ప్రేమానురాగాలు, ఆనందోత్సహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలవాలని.. అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారని కేసీఆర్ అన్నారు. మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాలను మరింతగా బలోపేతం చేసే దిశగా.. తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ కొనసాగుతోందని తెలిపారు. అనేక పథకాలను అమలు చేస్తూ.. మహిళలకు ప్రభుత్వం భరోసా అందిస్తోందని వెల్లడించారు. మహిళలకు పెద్దన్నలా రక్షణగా తమ సర్కార్ నిలిచిందని అన్నారు. ఫలితంగా నేడు తెలంగాణలోని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ.. విజయ ప్రస్థానాన్ని సాగిస్తూ, దేశానికే దిక్సూచిగా నిలిచారని చెప్పారు.