తెలంగాణల ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ప్రజలంతా అభ్యర్థులనే కాకుండా.. వారి వెనక ఉన్న పార్టీ చరిత్రను కూడా గమనించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటర్లకు సూచించారు. పోటీలో ఉన్న వ్యక్తి గుణగణాలతో పాటు పార్టీ చరిత్ర, నడవడిక, దృక్పథం చూడాలని చెప్పారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలని.. అది జరగాలంటే ప్రజలు బాగా ఆలోచించాలని తెలిపారు. తెలంగాణ సాధించిన వ్యక్తిగా చెప్పడం తన బాధ్యత అని జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వేదికగా కేసీఆర్ అన్నారు.
‘ప్రజల దగ్గర ఉండే వజ్రాయుధం ఓటు. ఐదేళ్ల నీ భవిష్యత్తును నిర్ణయించే అస్త్రం. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మళ్లీ వచ్చి ఒక్క ఛాన్స్ అంటోంది. అధికారమిస్తే పంటికి అంటకుండా మింగేద్దామని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. ఇప్పటికే 12-13 సార్లు కాంగ్రెస్ కు అధికారమిస్తే ఏం చేశారు. ధర్మపురిలో లక్షా 30 వేల ఎకరాలు సాగునీరు వచ్చేలా చేశాం. మిషన్ కాకతీయ చెరువులు బాగు చేసుకున్నాం. చెక్ డ్యాంలు కట్టుకున్నాం. తెలంగాణ వచ్చినరోజు ఇక్కడ చిమ్మచీకటి. కొత్తకుండలో ఈగ సొచ్చినట్లుండేది. సాగునీరు లేక వలసల బతుకులుండేవి. మేధావులు, నిపుణులు, ఆర్థిక నిపుణలు సలహాలతో పాలించుకుంటూ ఓ దరికి వచ్చాం.’ అని కేసీఆర్ అన్నారు.