తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలో బీజేపీకి కూడా అదే గతి పట్టబోతోందని జోస్యం చెప్పారు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ ఇద్దరూ ఒకేరకమన్న ఆయన వారు నాణేనికి బొమ్మ, బొరుసు లాంటి వారని చెప్పారు. ప్రజలను మోసం చేయడంలో ఇద్దరూ ఎవరికివారే సాటి అని విమర్శించారు. పీసీసీ అధ్యక్షునిగా పార్టీని, ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన వ్యూహాలు తనకు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇప్పటికే కొన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిందని,. ఈ నెల 27వ లేదా 28వ తేదీ కల్లా అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అనూహ్య ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన రేవంత్ బలమైన అభ్యర్థులు, సామాజిక సమీకరణాలు.. ఇలా అన్నీ పరిగణనలోకి తీసుకొనే తమ పార్టీ అధిష్ఠానం అభ్యర్థులను ఎంపిక చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 12 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.