రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు రంగం సిద్ధమైంది. త్వరలోనే జిల్లాల వారీగా పర్యటించి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటానని, అధికారుల పనితీరును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్లు చాలా వరకు కార్యాలయాలకే పరిమితం అవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి… ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులు కూడా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని ఆదేశించారు. ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు పనిచేస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
“తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో అధికారుల పాత్ర ఎంతో ఉంటుంది. మీ శాఖల పనితీరు మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలతో పనిచేయాలి. ప్రతి అధికారి కనీసం ఓ ఫ్లాగ్ షిప్ ఐడియాను 2 వారాల్లో ప్రభుత్వానికి సూచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల్లో అయిదు అమలు చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా తర్వాత వందరోజులు ప్రభుత్వ కార్యక్రమాలు ఆగిపోయాయి. ఇక నుంచి అధికారులు పరిపాలనపైనే దృష్టి సారించాలి. అనేక మంది సీఎంలతో పనిచేసిన అనుభవం కలిగిన అధికారులు కీలక విభాగాల్లో ఉన్నారు. అయితే వారి పనితీరు ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు ఉండాలి.” అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.