తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పీఠం కోసం పలువురు కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి, ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నెల 27తో పీసీసీ అధ్యక్షుడిగా తన మూడేళ్ల పదవీకాలం పూర్తవుతుందని.. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేతను అధిష్ఠానం నియమిస్తుందని తెలిపారు. అధిష్ఠానం నిర్ణయం ప్రకారమే నియామకం జరుగుతుందని వెల్లడించారు. దీంతో సీనియర్ నేతకే పీసీసీ పీఠం దక్కుతుందన్న హింట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.
తన నివాసంలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరోవైపు కేంద్రంలో ఏర్పడే ఇండియా కూటమి ప్రభుత్వంలో 4 మంత్రి పదవులు తెలంగాణ ఎంపీలకు ఇవ్వాలని అడుగుతామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు 8 నుంచి 12 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులకు బయోమెట్రిక్ పెట్టాలనుకుంటే ముందుగా సచివాలయంలో సీఎం, మంత్రులు, సీఎస్ సహా ఉన్నతస్థాయి వారికి పెడతామని.. ఆ తరవాతే కిందిస్థాయి వారికి ఆ విధానం వస్తుందని తెలిపారు.