రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వీయ క్రమశిక్షణ, జీవిత విలువలను రంజాన్ ప్రతిభింబిస్తుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల శ్రేయస్సు, శాంతి కోసం ప్రార్థిస్తున్నానని గవర్నర్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రంపై అల్లా దీవెనలను ఉండాలని అన్నారు. వంద రోజుల్లోనే పాతబస్తీలో మెట్రో రైలులైన్‌కు శంకుస్థాపన చేశామని సీఎం తెలిపారు. మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు పెంచినట్లు వివరించారు. సహనం, కరుణ, త్యాగం, పరోపకారాన్ని రంజాన్ పెంపొందిస్తుందని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అల్లా దయతో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
మరోవైపు మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులు జరిగిన ఉపవాస దీక్షలు ఆధ్యాత్మిక వాతావరణం నింపాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. రంజాన్ వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అల్లా దీవెనలను అందుకోవాలని కోరుకున్నారు.