తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు దిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. దిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడి ఇందిరాభవన్‌కు చేరుకున్నారు. కాసేపట్లో వారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, కేబినెట్ విస్తరణపై ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో రాష్ట్ర నేతలు చర్చించనున్నట్లు సమాచారం.
తెలంగాణలో అమలవుతోన్న కార్యక్రమాలపైనా ఏఐసీసీ పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం. ఇక శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, అమలు చేసినవి, పెండింగ్‌లో ఉన్న అంశాలు భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాక ఉగాది నాటికి మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఉన్నఫలంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర కీలక నేతలు దిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఇవాళ జరగాల్సిన బడ్జెట్ డిన్నర్ కార్యక్రమం వాయిదా పడింది.