తెలంగాణలో ఏడాదిగా ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్దాలతో నిత్యం ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన ముంబైలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చి అబద్ధాలను ఇక్కడి ప్రజలకు చెప్పారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్య పెట్టిందని.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత ఎలా మోసం చేస్తుందో మహారాష్ట్ర ప్రజలకు వివరించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ముందుకు వచ్చాను అని తెలిపారు.
ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలు ఇంకా ప్రారంభమే కాలేదు అన్నారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలకు వెన్ను పొడిచారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జోడీ తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేశారో.. అదే తరహాలో మహారాష్ట్ర ప్రజలను కూడా మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పూర్తిగా అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు.