గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.
హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం సూచించారు. అందులో నిపుణులైన కన్సల్టెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలన్నారు.
పెరిగిన వాహనాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో లేరని సమావేశంలో చర్చకు వచ్చింది. స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. మూడు నెలల్లోగా ఈ నియామకాలు జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. కొత్తగా నియమించిన వారికి తగిన శిక్షణనివ్వాలని సూచించారు. ఈలోపు వివిధ విభాగాల్లో పని చేస్తున్న హోం గార్డులను ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించాలని. తక్షణమే వారి సేవలను వినియోగించుకోవాలని చెప్పారు.