తెలుగు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్లతో ఇవాళ కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో కృష్ణానదీ జలాల్లో సగం వాటా ఇవ్వడం, ఆపరేషన్ ప్రోటోకాల్ సహా ఇతరత్రా అంశాలు ఖరారు కాకుండా ప్రాజెక్టులను స్వాధీనం చేయబోమని నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయనుంది. కేఆర్ఎంబీ ఛైర్మన్ శివనందన్ కుమార్ఇ వాళ నిర్వహించనున్న సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయం లిఖితపూర్వకంగా అందించనున్నట్లు సమాచారం.
దిల్లీ సమావేశానికి కొనసాగింపుగా రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో బోర్డు ఛైర్మన్ ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి ఈ భేటీలో పాల్గొననున్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు చెందిన 15 కాంపోనెంట్ల స్వాధీనానికి ఆపరేషన్ ప్రోటోకాల్‌పై చర్చించి కార్యాచరణ ప్రణాళిక ఖరారును అజెండాలో పొందుపర్చారు. ప్రాజెక్టుల స్వాధీనానికి అంగీకరించలేదని మినిట్స్‌లో తప్పుగా పొందుపరిచారని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు నేటి సమావేశానికి హాజరు కానున్న తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రాష్ట్రప్రభుత్వం తరఫున కృష్ణా బోర్డు ఛైర్మన్‌కి లేఖ అందించనున్నారు.