తెలంగాణ రైతులకు గుడ్న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేశారు. మొదటి రెండు దశలో లక్షన్నర వరకు రుణమాఫీ చేయగా ఇక ఇవాళ మూడో విడతలో భాగంగా రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో మూడో విడత రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.31 వేల కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జులై 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో రుణమాఫీ చేసింది. జులై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా రెండో విడతలో 1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణం కలిగి ఉన్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. ఇక ఇవాళ మూడో విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేయనుంది.