డీలిమిటేషన్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ అసలు రంగు బయటపడిందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం పార్టీ స్టేట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పై చెన్నెలో జరిగిన సమావేశంలో తెలంగాణ
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీపడి మాట్లాడటం, వారి నిజ స్వరూపాన్ని బయట పెట్టిందన్నారు. దేశంలో లేని సమస్యను సృష్టించి, బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పటివరకు పార్లమెంటులో లేదా కేబినెట్లో ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. కానీ, అవకాశవాద పార్టీలు దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తూ దిగజరారుడు రాజకీయాలకు తెరలేపుతున్నాయని అన్నారు. దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని, భవిష్యత్తులోనూ చేస్తోందన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో, తెలంగాణలో గెలిచేలా, తమిళనాడులో మరింత పట్టు సాధించేలా అంకితభావంతో పని చేస్తున్నామని చెప్పారు.