రేవంత్ రెడ్డి డీఎన్ఏలో కాంగ్రెస్ లేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇవాళ కేంద్రం చేపట్టబోతున్న కులగణన పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణనకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో వ్యతిరేకమని అన్నారు. ఆ పార్టీ గురించి రేవంత్ ఇంకా చాలా తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఓబీసీలపై రాహుల్, రేవంత్ లు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసమై తెలంగాణలో సర్వే చేపట్టారని ధ్వజమెత్తారు. చేసిన సర్వే వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
తాము ఎవ్వరి ఒత్తిడికి తలొగ్గలేదని కంటితుడుపు చర్యగా తాము సర్వేలు చేయబోమని అన్నారు. సామాజిక అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కులగణనను చేపట్టబోతుందని తెలిపారు. జనగణనతో పాటు కులగణన చేపడుతున్నందుకు ఆయన ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిణామంతో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిలో దూసుకెళ్తారని ఆకాంక్షించారు.