సోమవారం తెలంగాణ భవన్ లో 2023 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు సీఎం కేసీఆర్. 119 స్థానాలకు 115 స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేశారు. మరో నాలుగు స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపారు. అయితే తమను సంప్రదించకుండానే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడం పట్ల వామపక్షాలు గుర్రుగా ఉన్నాయి. ఈ విషయంపై తాజాగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు.
తెలంగాణలో కలిసి వచ్చే రాజకీయ శక్తులతోనే కలిసి పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ తమకు శత్రువు కాదని.. పార్టీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉభయ కమ్యూనిస్టులమందరం ఒకే విధానంతో ముందుకు వెళతామన్నారు. మునుగోడు లో కేసీఆర్ అవకాశవాదంగా వ్యవహరించారని మండిపడ్డారు తమ్మినేని. తమకు ఒక్కో సీటు ఇస్తామని చెప్పారని.. కానీ ఇప్పుడు తమతో ఒక్క మాటైనా చెప్పకుండా అభ్యర్థుల ప్రకటన చేశారని మండిపడ్డారు. కెసిఆర్ పొత్తులోనే కాదు.. మా విధానంతో కూడా విభేదించినట్లు ఉన్నారని అభిప్రాయపడ్డారు.