పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్(76) హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యేకాలనీలోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన తండ్రి పార్థివదేహాన్ని చూసి డీఎస్ పెద్దకుమారుడు సంజయ్ కంటతడి పెట్టారు. పార్లమెంట్ సమావేశాల కోసం దిల్లీలో ఉన్న డీఎస్ చిన్న కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ శనివారం బంజారాహిల్స్‌లోని నివాసానికి చేరుకున్నారు. అనంతరం భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో నిజామాబాద్‌కు తరలించారు.
ఇవాళ నిజామాబాద్లో ప్రభుత్వ లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు డీఎస్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ప్రగతినగర్‌లోని నివాసం నుంచి కంఠేశ్వర్, బైపాస్ రోడ్డు మీదుగా అంతిమయాత్ర సాగనుంది. బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. డీఎస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు నిజామాబాద్‌కు వెళ్లనున్నారు. డీఎస్ మరణానికి సంతాప సూచకంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ జెండాను అవనతం చేశారు.