హైదరాబాద్లోని గాంధీ భవన్లో సోమవారం రోజున కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నియమాక మండలి పీఏసీ ఏర్పాటు చేయడం పట్ల సర్వత్ర ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్ట మొదటిసారిగా సమావేశమవుతుండడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయాలపై ఆసక్తి రేకేత్తిస్తోంది.
ఈ సమావేశంలోనే నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ భేటీలో గ్యారెంటీల అమలుపై, ప్రస్తుత రాజకీయాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరోవైపు ఈనెల 21వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ జరగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇండియా కూటమి, రానున్న సార్వత్రిక ఎన్నికలు ఆ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములు, వాటికి గలకారణాలపై విశ్లేషణ వంటి పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.