తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల క్షేత్రంలోకి దిగి.. పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. దాదాపు మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఇక ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ కాక పుట్టిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు పాదయాత్రలు, బస్సు యాత్రలతో ప్రజల్లోకి వెళ్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయభేరి పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. తొలి విడతలో ఆ పార్టీ అగ్రనేత మూడ్రోజుల పాటు బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఇక ఈనెల 28 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు కాంగ్రెస్ రెండో విడత విజయభేరి యాత్ర చేపట్టనుంది. చేవెళ్లలో ప్రారంభం కానున్న ఈ యాత్ర.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మీదుగా నాగార్జునసాగర్ వరకు కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మొదటి రెండు రోజులు యాత్రకు ముఖ్య అతిథులుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్య మంత్రి డీకే శివకుమార్ పాల్గొంటారు. ఆ తర్వాత రెండు రోజులు ప్రియాంక గాంధీ.. చివరి రెండు రోజులు రాహుల్ గాంధీ.. విజయభేరి యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి