భారీ వర్షాల వల్ల తెలంగాణలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో కళ్ల కలక కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజలంతా ఈ భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సచివాలయంలో వైద్యారోగ్య ఉన్నతాధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, జిల్లాల వైద్యాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కళ్ల కలక పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఎక్కువ మందికి వైద్య సేవలు అందించేలా సరోజినీదేవి కంటి ఆసుపత్రి ఓపీ వేళలు పెంచాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
కంటి కలక విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వానాకాలంలో వైరల్ జ్వరాలతోపాటు సోకే ఈ తరహా ఇన్‌ఫెక్షన్లతో ప్రమాదకర పరిస్థితులు ఉండవని వైద్యనిపుణులు చెప్పారని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల తమ శాఖ పూర్తి అప్రమత్తతతో ఉందని వెల్లడించారు.