భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ ఫలితంగానే దేశం అభివృద్ధి చెందిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన ఒక చరిత్ర అని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి.. ప్రధానిగా ఎదిగి దేశానికి ఎనలేని సేవ చేశారన్నారు. భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్‌లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ ఆర్థిక సంస్కరణల వల్ల దేశం నేడు అభివృద్ధి పథంలో పయణిస్తున్నదని చెప్పారు.
పీవీ ఖ్యాతిని గుర్తించిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేశారన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పీవీకి దేశ అత్యున్నత పురస్కారం ఇచ్చిందని వెల్లడించారు. పీవీ చరిత్రను నేటి యువత చదువుకోవాలని సూచించారు. ప్రధానిగా నాడు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు ప్రభుత్వాల పాలన ముందుకు సాగుతున్నదని వెల్లడించారు.