రాష్ట్రంలో వడగళ్ల వానతో 3,120 ఎకరాల్లో పంట నష్టం

-

తెలంగాణలో శనివారం రోజున వడగండ్ల వాన కురిసింది. చాలా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వాన పడింది. ఈ అకాల వర్షాలకు రైతులు భారీగా నష్టపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా ఈ వానకు నాశనమైంది. అకాల వర్షాలు, వడగళ్లతో మొత్తం 3,120 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

శనివారం రాత్రి వరకు 2,200 ఎకరాల నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. రంగారెడ్డి, జనగామ, నిర్మల్‌ జిల్లాల్లో మరో 920 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు నివేదిక ఇచ్చారని మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటికే మార్చిలో కురిసిన వడగళ్ల వానలతో జరిగిన పంట నష్టాలకు పరిహారం విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం కోరామని చెప్పారు.

‘రైతులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా మరోమారు సంప్రదించి సత్వరమే నిధుల విడుదలకు అనుమతి కోరతాం. తాజాగా జరిగిన నష్టాన్ని కూడా త్వరగా మదింపు చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించాం. వానాకాలం సీజన్‌కు సరఫరా చేసే పచ్చిరొట్ట విత్తనాల సేకరణ కోసం టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది’ అని మంత్రి తుమ్మల తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news