తెలంగాణలో మండుతున్న ఎండలు..ఆ ప్యాకెట్లు ఇవ్వనున్న రేవంత్‌ సర్కార్‌!

-

తెలంగాణలో మండుతున్నాయి ఎండలు. ప్రస్తుత ఏప్రిల్, మే మాసాల్లో అధిక ఉష్ణోగ్రతతో కూడిన ఎండలు ఉన్నందున వడదెబ్బ, డీ-హైడ్రేషన్ తదితర వ్యాధులకు గురికాకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో త్రాగు నీటి సరఫరా, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ధాన్యం కొనుగోలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ, ఈ రెండు మాసాల్లో రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణా ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లలో 45 డిగ్రీలకు ఉష్టోగ్రతలు చేరుకుని తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపారు. ఈ సందర్భంగా వేసవిలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్తలపై ప్రజలను పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, ఐ.వీ ఫ్లూయిడ్లు, ఇతర మందులను పెద్ద మొత్తంలో పంపిణీ చేశామని, వాటిఅన్నింటినీ సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో అందుబాటులో ఉంచామని శాంతి కుమారి వెల్లడించారు. అదేవిధంగా, ఓఆర్ఎస్ పాకెట్లను కూడా ప్రతీ ఆశా కార్యకర్తల వద్ద అందుబాటులో ఉన్నాయని, ఉపాధి హామీ పనుల కేంద్రాలవద్ద కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య పిల్లలు, వృద్దులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news