జోమాటోకి ట్రాఫిక్ పోలీసుల సూటి ప్రశ్న.. ఇవే నేర్పిస్తున్నారా.

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య ఇబ్బందిగా మారుతున్న సంగతి తెలిసిందే. రోడ్ల మీద వాహానాలు పెరుగుతుండడంతో సమస్య రోజు రోజుకీ ఎక్కువవుతూ ఉంది. అదీగాక ట్రాఫిక్ నియమాలని తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వెళ్ళే వాహనదారులు మరింత ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా కూడా రోడ్డు తమదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన జొమాటోకి ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా మర్యాదపూర్వకంగా హెచ్చరించారు. ఒకానొక జొమాటో ఎగ్జిక్యూటివ్ బైక్ మీద వెళుతూ తప్పుదారిలో రోడ్డును దాటుతున్నాడు. ఈ మేరకు ఈ విజువల్స్ సీసీటీవీలో పడ్డాయి. ఆ వీడియోని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, మీ ఎగ్జిక్యూటివ్స్ కి ఇదే నేర్పుతున్నారా అంటూ ప్రశ్నించింది. అయితే ఈ విషయమై స్పందించిన జొమాటో టీమ్, ఆ బైకు ఇతర వివరాలు తెలియజేస్తే చర్యలు తీసుకుంటామని, మళ్ళీ ఇలాంటి తప్పులు జరగనీయకుండా చూసుకుంటామని తెలిపింది.