గురుకుల విద్యార్థుల మరణాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలేనని ఎమ్మెల్యే సంజయ్ డాక్టర్ సంజయ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సంజయ్ మీడియాతో మాట్లాడారు. గత ఏడు నెలల్లో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో 36 మంది విద్యార్థులు చనిపోయారని, దాదాపు 500 మంది విద్యార్థులు ఈ ఏడు నెలల్లో ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఈ విద్యార్థుల మరణాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే అని ఎమ్మెల్యే చెప్పారు.
ఇంతకు ముందు మంచాన పడ్డ మన్యం అని వార్తలు చూసేవాళ్లం. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఆ న్యూస్ కనబడకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచాన పడ్డ గురుకుల విద్యార్థులు అని రోజు వార్తలు వస్తున్నాయి. విద్యార్థుల మరణాలపై మంత్రులు, అధికారుల నుంచి స్పందన లేదు. తన సొంత నియోజకవర్గంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని, వారిలో ఇద్దరు మరణించారని తెలిపారు.