తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభతో పాటు మండలిలో ఇవాళ చర్చ జరగనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రభుత్వం ఈనెల 25వ తేదీన ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది. శాసనసభ, శాసనమండలిలో బడ్జెట్ పై సాధారణ చర్చతో పాటు.. అసెంబ్లీలో పద్దులపై కూడా చర్చ పూర్తయింది. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది.
ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైన వెంటనే నేరుగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ చేపడతారు. అందుకు అనుగుణంగా అసెంబ్లీలో ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ద్రవ్య వినమయ బిల్లుపై చర్చకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సమాధానం ఇస్తారు. శాసనసభలో ఆమోదం పొందిన అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుపై మండలిలోనూ చర్చిస్తారు. అక్కడ కూడా డిప్యూటీ సీఎం సమాధానం ఇస్తారు. మండలిలోనూ ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. శాసనసభ ముందుకు ఇవాళ మరో రెండు బిల్లులు రానున్నాయి. సివిల్ కోర్టుల సవరణ బిల్లు, తెలంగాణ చట్టాల బిల్లు లను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.