కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటన పెను విషాదం నింపింది. ఈ ఘోర విలయంలో ఇప్పటి వరకు 123 మంది మృతి చెందారు. వరద, బురదలో 98 మంది ఆచూకీ గల్లంతయింది, వారి కోసం వయనాడ్ జిల్లాలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన ప్రభావం ముండక్కై, చూరల్మల, అట్టమాల, నూల్పూజ గ్రామాలపై ఎక్కువగా పడింది. వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. నిద్రిస్తుండగానే అనేక మంది గ్రామస్థులు కొట్టుకుపోయారు.
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో త్రుటిలో ప్రాణాలతో బయటపడిన వారు…ఆ భయానక ఘటనకు గుర్తు చేసుకున్నారు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున బురదతో కూడిన వరద తమ ఇళ్ల వైపు రావడం గమనించినట్టు పలువురు తెలిపారు. ముండకైలో సోమవారం రాత్రి ఒంటిగంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడ్డట్లు స్థానికులు చెప్పారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడినట్లు వెల్లడించారు. మరోవైపు సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతుండటంతో డ్రోన్లు, జాగిలాలతో గల్లంతైన వారి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. శిక్షణ పొందిన బెల్జియన్ మాలినోయిస్, లాబ్రడార్, జర్మన్ షపర్డ్ జాతికి చెందిన స్నిఫర్ డాగ్‌లను సైన్యం రంగంలోకి దించుతోంది.