బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ని తీవ్రంగా ఖండించారు మాజీ ఎంపీ, బిజెపి బిజెపి నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ ఎప్పుడో అయ్యిందని.. నిన్న రాత్రి మళ్ళా అదే రుజువైందన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ని ఎటువంటి నోటీసు, వారెంటు లేకుంట పోలీసులతో అరెస్టు చేయించి, ప్రశ్నించిన ప్రతీసారీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాం అని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించుకుందని దుయ్యబట్టారు.
“టెర్రరిస్టులను, నక్సలైట్లను అరెస్టు చేసినట్టు ఒక పార్లమెంటు సభ్యుడిని, కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎటువంటి కారణం చెప్పకుండా అరెస్టు చెయ్యడం అత్యంత హేయమైన చర్య. బహుశా ఇది తెలంగాణ పోలీసుల కోసం రాసిన కొత్త పీనల్ కోడ్ ఏమో అనిపిస్తుంది. అసలు ఈ అరెస్టు ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్న.? టి.ఎస్.పి.ఎస్.సి. పరీక్ష ప్రశ్న పత్రాలు లీకైనప్పుడు ప్రశ్నించినందుకా? లేకపోతే నిన్న మొన్న పదో తరగతి బోర్డ్ పరీక్షల తెలుగు పేపర్, ఆ తర్వాతి రోజు హిందీ పేపర్ లేకైతే ప్రశ్నించినందుకా? వరుసగా ఒక్కొక్క పరీక్ష పేపర్ ప్రభుత్వ అసమర్థ, అన్యాయ, అక్రమ పాలనలో లీకైతుంటే ఆగమైతున్న విద్యార్థుల పక్షాన ప్రశ్నించి నిలిచినందుకా?
లేకుంటే…నిన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సదివిన ఎం.ఎస్.సి. పొలిటికల్ సైన్స్ డిగ్రీ ని సూపెట్టమని అడిగినందుకా? అని….తెలంగాణ ప్రజలు అడుగుతున్నరు. వినాశకాలే విపరీత బుద్ధి అని నిరూపితమైందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా నీ నియంత విధానాలను సరిదిద్దుకొని వెంటనే శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని విడుదల చెయ్యాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ నలుమూలల ప్రజల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేస్తున్న అవినీతి కుటుంబ పాలన మీద భారతీయ జనతా పార్టీ తరుపున పోరాటం మరింత ఉదృతం చేస్తాం” అని హెచ్చరించారు.