ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, బఫర్ జోన్ల పరిరక్షణే ధ్యేయంగా నెలకొల్పిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఇప్పుడు అక్రమార్కుల పాలిట సింహ స్వప్నమైంది. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా చెరువులను ఆక్రమించి నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ముందుకెళ్తుంది హైడ్రా. ఈ తరుణంలోనే శనివారం ఉదయం మాదాపూర్ లో సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను భారీ భద్రత నడుమ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
ప్రస్తుతం రాజకీయంగా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటన పై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఎన్ కన్వెన్షన్ ను బఫర్ జోన్ లో కాదు.. చెరువులోనే నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. భావి తరాల భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకూడదనే చెరువులు ఆక్రమణకు గురికాకుండా హైడ్రా ను ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి శాటిలైట్ ఫొటోలను త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. గత పదేళ్లలో చెరువుల ఆక్రమించిన వారి వివరాలు తెలుసుకుంటున్నామని, త్వరలోనే వారిపై కూడా చట్టప్రకారం.. చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.