సమ్మర్ లో 24/7 కరెంట్ కు ఇబ్బంది రాకుండా చూస్తాం : భట్టి విక్రమార్క

-

ప్రజల భవిష్యత్తు అవసరాలకు తగినంత విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్ధ్యం అభివృద్ధి చేసేందుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 2031-32 అంచనాల ప్రకారం ఆయా వ్యవస్థల సామర్థ్యం పెంపొందించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన భట్టి విక్రమార్క.. రామగుండం ఎన్టీపీసీ ఫేజ్-2లో 2 వేల 400 మెగావాట్ల ఉత్పత్తికి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలను త్వరగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆధ్వర్యంలో జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో అదనంగా 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా తొలి విడతలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ ప్లాంట్లను నిర్మాణం చేస్తోందని అధికారులు భట్టికి వివరించారు. వచ్చే వేసవిలో రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news