రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి 30 రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేడుకల్లో భాగంగా నెలరోజులు సూర్యోదయానికి ముందే గోదాదేవి వ్రత పర్వం, మార్గళి, పాశురాల పఠనం నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. మొదటి రోజు అమ్మవారికి తిరుప్పావై కార్యక్రమం మంగళ వాద్యాల నడుమ పాశురాల పఠనం చేసినట్లు చెప్పారు. ఆలయ సంప్రదాయ ప్రకారం శాస్రోక్తముగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.
మరోవైపు యాదాద్రి పుణ్య క్షేత్రంలో అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సుదర్శన నారసింహ హోమం ప్రారంభమైంది. ఈ విశిష్ట హోమం ఐదు రోజుల పాటు కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
మూల మంత్ర జప సహిత హవనపర్వ హోమం నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర రీత్యా హోమాది క్రతువు కొనసాగుతొందని.. ఆలయ ప్రధాన పూజారి కాండూరి వెంకటాచార్య వెల్లడించారు. ఓవైపు ధనుర్మాస ఉత్సవాలు.. మరోవైపు సుదర్శన నారసింహ హోమం.. ఇంకోవైపు ఆదివారం కావడంతో ఇవాళ యాదాద్రికి భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు.