తెలంగాణ సర్కార్ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్నాళ్లు చెల్లించకుండా ఉన్న చలానాలపై ఇప్పుడు డిస్కౌండ్ ప్రకటించింది. వాహనాల పెండింగ్ చలాన్లపై రాయితీకి అనుమతి ఇస్తూ రవాణాశాఖ కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో వాహనదారులకు చలాన్ల భారం గణనీయంగా తగ్గనుందని అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల నుంచి రావాల్సిన చలానా మొత్తం భారీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ద్విచక్ర వాహనాలకైతే ఆ బండి ధర కంటే చలాన్ల మొత్తం అధికంగా ఉందని తెలిపారు. చాలామంది వాహన యజమానులు ఈ మొత్తాన్ని చెల్లించడం లేదని.. ఈ నేపథ్యంలో పెండింగ్ చలాన్లపై రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
ద్విచక్ర వాహనాలు, ఆటోల పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం 80 శాతం రాయితీ ఇవ్వగా.. ఆర్టీసీ బస్సులపై 90 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఇక ఇతర భారీ వాహనాలతో పాటు కార్లపై ఉన్న చలాన్లను 60 శాతం రాయితీతో చెల్లించవచ్చు. ఈ విధానం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిందని.. బకాయి మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.