తన గెలుపు పోలింగ్‌కు ముందే నిర్ణయమైపోయిందని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. తమ కార్యకర్తలను చాలామంది బెదిరించారని.. ఎన్ని బెదిరింపులు వచ్చినా బీజేపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదని తెలిపారు. మోదీ అభివృద్ధి కార్యక్రమాలు చూసే ప్రజలు తనకు ఓటేశారని పేర్కొన్నారు. కేంద్రం అమలుచేస్తున్న అనేక పథకాలు పేదలకు అందుతున్నాయని అన్నారు. పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశం కోసం.. ధర్మం కోసం.. అంటూ ఏకపక్షంగా బీజేపీకి ప్రజలు ఓటేశారని అన్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో విజయం కాషాయ పార్టీదేనని జోస్యం చెప్పారు. తమ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడ్డారన్న డీకే అరుణ.. మోదీ మళ్లీ ప్రధాని కావాలని పార్టీలకు అతీతంగా చాలామంది ఓటేశారని తెలిపారు. ఓటర్ల అభీష్టం మేరకే మోదీ మూడోసారి భారత ప్రధాన మంత్రి అవుతారని డీకే అరుణ ఆశా భావం వ్యక్తం చేశారు.