కర్ణాటక విజయం ఇచ్చిన జోష్‌లో తెలంగాణ గడ్డపైనా జెండా పాతాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశలోనే తీవ్రంగా కృషి చేస్తోంది. వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచారం, అమలు చేయాల్సిన వ్యూహాల బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు అప్పగిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, ఏఐసీసీ కార్యదర్శులు తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వీరికి అదనంగా అధిష్ఠానం ఇద్దరు ముఖ్యులను కేటాయించడం గమనార్హం.
కాంగ్రెస్ అధిష్ఠానం తరఫున ప్రియాంక, శివకుమార్‌లు రాష్ట్ర పార్టీకి సంబంధించిన అన్ని అంశాల్లోనూ నిర్ణయాలు తీసుకోనున్నారట. ముఖ్యంగా నాయకుల మధ్య ఐక్యతను కాపాడటం, వారంతా సమన్వయంతో పని చేసేలా చూడటం వ్యూహాల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేయడం… ఇలా అన్ని అంశాల్లోనూ కీలక భూమిక పోషించనున్నట్లు తెలిసింది.