డా.బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అటవీ అనుమతులపై ఇరు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి జీవ నాడులైన రహదారుల నిర్మాణం అటవీ అనుమతులు లేక ఆగిపోతే.. అది రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపుకు ఆటంకంగా మారుతుందన్నారు.
అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల గత 5 ఏళ్లలో దాదాపు 58 రోడ్ల అనుమతులు పెండింగ్ లో ఉన్నాయి. అటవీ అనుమతులు లేక ఆగిపోయిన ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు అనుమతుల సాధనకు ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో ఎస్ఈ స్థాయి అధికారిని.. అటవీ శాఖ నుంచి ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించారు. చాలా ఏళ్ల నుంచి రోడ్లు అధ్వాన్నంగా మారాయని పేర్కొన్నారు. కొన్ని రోడ్లలో ప్రయాణించాలంటే ప్రయాణికులు భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆర్ &బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, అటవీశాఖ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్ తదితర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.