ఇటీవల కర్ణాటక-ఆంధ్ర జీవనాడి అయిన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. గేటు కొట్టుకుపోవడంతో భారీ ఎత్తున నీరు వృథాగా పోయింది. వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని డ్యామ్ల భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు ఏళ్ల క్రితం కట్టిన డ్యామ్లన్నీ భద్రంగానే ఉన్నాయా..? వాటి వల్ల ప్రమాదాలేమైనా ఉన్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈ క్రమంలో జలాశయాల గేట్లు కొట్టుకుపోతున్న ఘటనలతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల డ్యాం భద్రతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడి చాలా గేట్లకు లీకేజీలు ఏర్పడినట్లు సమాచారం. ఇది స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. వీటికి మరమ్మతులు చేపట్టాలని నిపుణులు చాలా ఏళ్లుగా చెబుతూ వస్తుండగా.. 2021లో ప్రభుత్వం కొన్ని నిధులు కేటాయించింది. కానీ సాంకేతిక సమస్యలు, నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో మొత్తం 62 గేట్లలో ఐదింటికి మాత్రమే మరమ్మతులు జరిగాయి. మిగతా వాటి పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని.. ఏ క్షణమైనా ముప్పు పొంచి ఉందని జూరాల ఈఈ జుబేర్ అహ్మద్ వెల్లడించారు.