ఈనెల 15న రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

-

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి జాతీయ నేతలు తరలివస్తున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత వారం రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటించనున్నారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా ఈ నెలలో తెలంగాణలో పర్యటించనున్నారు.

ఈ నెల 15వ తేదీన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రానికి రానున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ 16వ తేదీన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన సీఎస్‌ శాంతికుమారి ట్రాఫిక్‌, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. రాష్ట్రపతి కార్యాలయ అవసరాలకు అనుగుణంగా సహాయక సిబ్బందితో పాటు మహిళా వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి కాన్వాయ్‌ పయనించే మార్గాల్లో మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. డీజీపీ రవిగుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌, పొలిటికల్‌ సెక్రటరీ రఘునందన్‌రావు, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news