తెలంగాణలో ఇక డ్రగ్స్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు

-

సాధారణంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తారని తెలుసు. తాగిన మత్తులో జరిగే ప్రమాదాల నివారణ, మందుబాబుల్లో పరివర్తన తీసుకురావడం కోసం ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.అయితే డ్రగ్స్ నివారణే లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ పోలీసులు ఇప్పుడు ఆ దిశగా మరో నూతన కార్యక్రమానికి నాంది పలికేందుకు సిద్ధమయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో ఇప్పుడు డ్రగ్స్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర పోలీస్‌ నిర్ణయించింది. మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని, ప్రధానంగా గంజాయి తాగే వారిని గుర్తించడం కోసం ‘ఎబోన్‌ యూరిన్‌ కప్‌’ యంత్రంతో పరీక్షలు జరపాలని నిర్ణయించింది.

తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌న్యాబ్‌) ఈ పరీక్షల కిట్‌ను సమకూర్చి.. అన్ని పోలీస్‌ స్టేషన్లకు పంపింది. ఈ పరికరం సాయంతో డ్రగ్స్‌ వినియోగించే వారిని గుర్తించే విధానంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. ఇప్పటికే కొన్ని ఠాణాల పరిధిలో తనిఖీలు మొదలయ్యాయి. గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాలు వినియోగించారనే అనుమానం వచ్చిన పక్షంలో ఈ కిట్‌ ద్వారా మూత్ర పరీక్ష నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. పరికరంలో రెండు ఎర్ర గీతలు కన్పిస్తే ‘నెగెటివ్‌’గా, ఒకటే గీత కన్పిస్తే ‘పాజిటివ్‌’గా పరిగణిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news