బతుకమ్మ, దసరా పండుగ దగ్గరికి వచ్చేస్తోంది. తెలంగాణ ప్రజలంతా బతుకమ్మ సంబురాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది. రేపటి నుంచే ఈ సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 13వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.
13 రోజుల సెలవుల అనంతరం అక్టోబరు 26న బడులు పునఃప్రారంభమవుతాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ-1) పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఆ పరీక్షల ఫలితాలు సెలవుల అనంతరం వెల్లడిస్తారు. మరో వైపు ఫార్మెటివ్ అసెస్మెంట్-1, 2 పరీక్షల మార్కులను గురువారం లోపు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని జూనియర్ కళాశాలలకు ఈ నెల 19వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయి. మరోవైపు బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ పూర్తయింది.