బతుకమ్మ, దసరా పండుగ సమీపిస్తోంది. ఇప్పటికే బతుకమ్మ పండుగ షురూ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు కూడా వచ్చేశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నగరవాసులు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. వీరి ప్రయాణం సాఫీగా సాగడానికి ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. మరో వైపు తెలంగాణ-ఏపీ మధ్య కూడా ప్రత్యేక బస్సు సర్వీసులు నడుస్తున్నాయి.
ఇక దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాచిగూడ-కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ నెల 19, 26 తేదీల్లో కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు(07653) రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తిరిగి ఈ నెల 20, 27వ తేదీల్లో కాకినాడ పట్టణం నుంచి ప్రత్యేక రైలు(07654) సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందని చెప్పారు. మల్కాజిగిరి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.