తెలంగాణలో ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల సంఖ్య గతేడాది కంటే భారీ సంఖ్యలో పెరిగింది. విదేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులు.. రాష్ట్రంలో ఓటు హక్కుపై ఆసక్తి చూపుతుండటంతో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల సంఖ్య 2,780కి చేరినట్లు వెల్లడించారు. అయితే 2014లో ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల సంఖ్య 5 కాగా.. 2018కి 244కు.. ప్రస్తుతం 2,780కి చేరిందని చెప్పారు.
రాష్ట్రంలోని బోధ్, నారాయణ్‌ఖేడ్ మినహా మిగిలిన 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు నమోదయ్యారని ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న ఎన్‌ఆర్‌ఐలలో పురుషులు 2,248 మంది, మహిళలు 531 మంది, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నట్లు వెల్లడించారు. అత్యధికంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో 206 మంది నమోదవ్వగా.. 131 ఓట్లతో ఉప్పల్, 102 ఓట్లతో కూకట్‌పల్లి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని.. ఆరు నియోజకవర్గాల్లో ఒక్కో ఓటరు చొప్పున ఉన్నారని పేర్కొన్నారు.
ఎన్‌ఆర్‌ఐ ఓటర్లకు ప్రత్యేకంగా ఓటరు గుర్తింపుకార్డు ఉండదని.. ఒరిజినల్ పాస్‌పోర్టును చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అధికారులు చెప్పారు. ఓటర్ల జాబితాలోనూ వీరిని ప్రత్యేకంగా నమోదు చేస్తారని వెల్లడించారు.