తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ అలెర్ట్ జారీ చేసింది. గ్రూప్-2కు అఫ్లై చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈనెల 8నుంచి 12వరకు వెబ్‌సైట్‌లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
ఆధార్ నంబరు, పుట్టిన తేదీ తదితర వివరాలు మార్చేందుకు తగిన ఆధారం సమర్పించాలని కమిషన్ స్పష్టం చేసింది. సవరణలకు మరో అవకాశం ఉండదని తెలిపింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల కోసం 5,51,901 మంది దరఖాస్తు చేశారు. గతేడాది డిసెంబరు నెలలో 783 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
గ్రూప్-2 నియామకాల కోసం ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వాహణకు టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 600 మార్కులకు నాలుగు పేపర్లలో ఆబ్జెక్టివ్ విధానంలో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ గ్రూప్-2 పరీక్షలో మొదటి పేపర్‌లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీస్ ఉండనున్నాయి. రెండో పేపరులో హిస్టరీ, పాలిటీ, సొసైటీ సబ్జెక్ట్లు ఉంటాయి. మూడో పేపర్‌లో ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్.. నాలుగో పేపర్‌లో తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఉంది. 783 పోస్టులకుగానూ.. ఒక్కో పోస్టుకు 705 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు.