తెలంగాణ ప్రయాణికులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో త్వరలో ఎలక్ట్రిక్ సూపర్‌లగ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలో కరీంనగర్ – హైదరాబాద్, నిజామాబాద్ – హైదరాబాద్ మార్గాల్లో ఈ బస్సులు రానున్నాయి. వీటికి ‘ఈ-సూపర్ లగ్జరీ’గా పేరు పెట్టారు.
కరీంనగర్-2 డిపోకు 35, నిజామాబాద్-2 డిపోకు 13 బస్సులు చేరుకున్నాయి. త్వరలోనే వీటిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. ఆర్టీసీ ఆర్థిక నష్టాల్లో ఉన్నందున.. కొత్త బస్సుల కొనుగోలు ఖర్చు భారం లేకుండా అద్దె పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకుంటోంది. వీటిల్లో డ్రైవర్లుగా బస్సు తయారీ సంస్థ సిబ్బందే ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కండక్టర్లు ఆర్టీసీ నుంచి ఉంటారని వెల్లడించాయి.
ఈ బస్సులకు కిలోమీటర్ల వారీగా అద్దె చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ప్రయాణికులకు త్వరలో ఎలక్ట్రిక్ సూపర్‌ల గ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. సూపర్‌లగ్జరీలో ఎలక్ట్రిక్ బస్సులు రానుండటం ఇదే తొలిసారి అని వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్సులు తీసుకు వస్తున్నట్లు చెప్పారు.