తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ బీజేపీ, ప్రస్తుత కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీశ్ రావు, రాధా కిషన్ రావు పై 120(B), 386, 409 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం సంచలనంగా మారగా.. తనపై ఇప్పటివరకు నమోదైన కేసులపై మాజీ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అదేవిధంగా తనపై ఎందుకు కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. హరీశ్ రావు తన ట్వీట్ లో మిస్టర్ రేవంత్ రెడ్డి అడగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక సహించలేక నా మీద అక్రమ కేసులు ఎన్నో బనాయిస్తున్నావు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా.. నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను అని రాసుకొచ్చారు.