వచ్చే వేసవిలో విపరీతమైన వేడి ఉంటుందని వాతావరణశాఖ ప్రకటన చేసింది. భూమిపైన ఇప్పటివరకు అత్యంత వేడి సంవత్సరంగా నిలిచినటువంటి 2023 లాగానే ఈ ఏడాది వేసవిలోను అత్యంత వేడిగా ఉండనున్నట్టు వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ది ప్రొవిజినల్ స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది.
నిరుడు వేసవి లో ఎల్ నినో ప్రభావం మాదిరిగానే ఈ ఏడాది కూడా అవే పరిస్థితిలో అలుముకున్నాయి. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ మార్పుల వల్లే సాధారణ ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసు కున్నట్టు తెలిపింది. గ్రీన్ హౌస్ వాయువుల వల్ల ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని, వీటి ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని తెలిపింది. ఈనెల చివరి వారంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. మార్చి 20 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు వాతావరణశాఖ అధికారులు.